మోతే గ్రామంలో వీడిసీ ఆగడాలు — గేటు వేసినందుకు కులబహిష్కరణ బెదిరింపులు!
నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలంలో మరోసారి వీడిసీ సభ్యుల తీరుపై ప్రజల్లో ఆగ్రహం — బాధితుడు పోలీసుల సహాయానికి!
మనోరంజని తెలుగు టైమ్స్ బాల్కొండ ప్రతినిధి అక్టోబర్ 28
వేల్పూరు మండలం, అక్టోబర్ 28:
రోజురోజుకూ పెరుగుతున్న వీడిసీ సభ్యుల ఆగడాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం మోతే గ్రామంలో మరో ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోల జ్ఞానేశ్వర్ తన ఇంటి పక్కన ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసి, గ్రామ పంచాయతీ అనుమతితో గృహనిర్మాణ పనులు ప్రారంభించారు. సీసీ రోడ్డుకు ఆనుకుని గేటు ఏర్పాటు చేసుకునేందుకు పంచాయతీ సెక్రటరీ అనుమతి కూడా తీసుకున్నారు. అయితే, కొంతమంది కాలనీవాసులు గేటు ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వివాదం పరిష్కారానికి జ్ఞానేశ్వర్ వీడిసీ సభ్యులను ఆశ్రయించగా, వారు “జిపి రోడ్డు అందరి వాడుకకు ఉంటుంది” అని చెప్పారు. కానీ, జ్ఞానేశ్వర్ అమెరికా వెళ్లిన తర్వాత, అదే వీడిసీ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా తీర్మానం చేసి, గేటును అడ్డుగా గోడలు నిర్మించాలని నిర్ణయించడం, అంతేకాదు రూ. 1.50 లక్షల జరిమానా విధించి కులబహిష్కరణ చేస్తామని బెదిరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధితుడు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, సంబంధిత గ్రామ సెక్రటరీ, ఎంపీవో అధికారులు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానికులు వీడిసీ సభ్యుల తీరును ఖండిస్తూ, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని, ఇలాంటి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.