ఇలా తయారయ్యారేంట్రా బాబూ.. 5 గదుల్లో విద్యార్థులకు క్లాస్‌లు.. 6వ గదిలో భయంకరమైన రహస్యం
సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని శ్రీమేధ స్కూల్ బిల్డింగ్.. డ్రగ్స్ తయారీకి అడ్డాగా మారినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
మొత్తం ఆరుగదుల ఈ పాఠశాలలో ఐదు గదుల్లో ప్రతిరోజు విద్యార్థులకు క్లాస్‌లు జరుగుతుంటే.. ఆరవ గదిలో మాత్రం ఒక భయంకరమైన చీకటి రహస్యం దాగి ఉంది.
ఆ గది తలుపులు తెరిచిన ఈగల్ టీమ్‌కు కళ్లు బైర్లు కమ్మాయి.
ఆరో గదిలో సైన్స్ ల్యాబ్ ముసుగేసిన ఈ రహస్య గదిలో మత్తు పదార్థాల ప్రొడక్షన్ జరుగుతోంది. అది కూడా అత్యంత ప్రమాదకరమైన LSD, ఆల్ఫ్రాజోలం అనే నిషేధిత డ్రగ్ తయారు చేస్తున్నారు.
కల్తీకల్లు కోసం వేరే జిల్లాలకు ఆల్ఫ్రాజోలం సరఫరా
పోలీసులు, పబ్లిక్ కళ్లుగప్పి విచ్చలవిడిగా ఇక్కడ తయారైన ఆల్ఫ్రాజోలంను కల్తీకల్లు కోసం జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. ఈ రహస్య గదిలో సరుకు తయారవుతుండగా ఈగల్ టీమ్ రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకుంది. బడిలోనే ఇలా కుటీరపరిశ్రమ పెట్టిన బద్మాష్ ఎవరో కాదు ఈ స్కూల్ డైరెక్టర్ జయప్రకాష్ గౌడ్.
కొరియర్ బాయ్ మురళీ, ఉదయసాయి అరెస్ట్
ఈ కేసులో జయప్రకాష్ గౌడ్‌ని ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పోలీసులు.. అతడితో స్కూల్ ప్రిన్సిపాల్, కొరియర్ బాయ్ మురళీ, శ్రీసాయి ట్రావెల్స్‌కి చెందిన ఉదయసాయిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తయారు చేసే పరికరాలు, రూ.20 లక్షల నగదును సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.కోటికి పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇన్నాళ్లు వెనుకబడిన ప్రాంతాలు, మారుమూల గ్రామాలకు ఇలాంటి ఘటనలు పరిమితం. కానీ హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న స్కూల్స్‌నే డెన్‌గా మార్చేడం ఆందోళన కలిగిస్తోంది. పాఠశాల ముసుగులో ఇలా అక్రమ వ్యాపారం జరగడం తల్లిదండ్రులకు, సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక.. పిల్లల కోసం ఎంచుకునే పాఠశాలల్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడం ఇప్పుడు తల్లిదండ్రులకు ఒక సవాల్.