కవి జేపి రావుకు ప్రతిష్టాత్మక సాహితీ కిరీటి పురస్కారం
బైంసా మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 28
ప్రతిష్టాత్మకమైన సాహితీ కిరీటి పురస్కారం భైంసా పట్టణానికి చెందిన శ్రీ హంస వాహిని సాహిత్య కళా పీఠం అధ్యక్షులు, ప్రముఖ కవి- రచయిత జాదవ్ పుండలీక్ రావు పాటిల్ కు లభించింది. అంతర్జాతీయ సాహితీ సంస్థ శ్రీశ్రీ కళావేదిక అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణ్ ఆధ్వర్యంలో పురస్కారం అందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియంలో ఆదివారం నిర్వహించిన తెలుగు సాహితీ పట్టాభిషేకం మహోత్సవంలో జేపి రావు పాటిల్‌కు అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం సాహిత్యాభిమానులు, కవులు, రచయితలతో సందడిగా జరిగింది. ఈ పురస్కారం అందుకున్న జేపి రావు పాటిల్‌ను జిడిఆర్ మెమోరియల్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్, డా. దీప జాదవ్, డా. సూర్యకాంత్, ప్రముఖ నిర్మల్ కవులు డా. తుమ్మల దేవ్ రావు, పత్తి శివ ప్రసాద్, పోలీస్ భీమేష్, కడారి దశరథ్, వాడేకర్ లక్ష్మణ్ తదితరులు అభినందించారు. జేపి రావు పాటిల్ తన సాహితీ సౌరభంతో తెలుగు సాహితీ రంగంలో విశేష కృషి చేస్తున్నారు. వారి రచనలు, కవితలు పాఠకులను ఆకట్టుకుంటూ, సాహిత్యంలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. ఈ పురస్కారం వారి సాహితీ సేవకు గౌరవంగా నిలుస్తుంది. ఈ కార్యక్రమంలో సాహితీ ప్రముఖులు, కవులు, రచయితలు పాల్గొని జేపి రావు సాహిత్య రంగంలో చేస్తున్న కృషిని కొనియాడారు. అవార్డు జేపి రావు సాహితీ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.