కశ్మీర్ లో మరోసారి పంజా విసిరిన ఉగ్రవాదులు

హైదరాబాద్, అక్టోబర్ 21:

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు ఆదివారం అర్ధరాత్రి మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. గండేర్బల్ జిల్లాలో గగంగీర్‌లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఒక ప్రైవేట్ సంస్థ నిర్మాణ స్థలంలో జరిగిన ఈ ఘటనలో చనిపోయినవారిలో ఓ వైద్యుడు మరియు ఐదుగురు భవన నిర్మాణ కూలీలు ఉన్నట్టు సమాచారం. ముష్కరుల కాల్పుల్లో మరికొందరు గాయపడినట్టు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికేతర కార్మికులపై జరిగిన ఈ దాడి హేయమైందని, పిరికిపంద చర్యగా మండిపడ్డారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు, పరిస్థితి విషమంగా ఉన్నవారిని శ్రీనగర్‌లోని స్కిమ్స్‌కు తరలించాలని సూచించారు.

గుండ్ ప్రాంతంలో ఓ సంస్థకు చెందిన నిర్మాణ కార్మికుల క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడి చేసి, కాల్పులు జరిపారు. ఆ ప్రాంతంలో సొరంగ నిర్మాణం జరుగుతోందని అధికారులు తెలిపారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ అక్కడకు చేరుకుని ముష్కరుల కోసం గాలింపు చేపట్టారు.

Leave a Comment