*అడ్డదారుల్లో వెళ్తుంటే అడ్డుకోవాల్సిన తల్లే..*
*కొడుకు, కూతురుతో అక్రమ దందా చేయిస్తూ..*
కోడుకు.. కూతురు.. అడ్డదారుల్లో వెళ్తుంటే అడ్డుకోవాల్సిన తల్లే.. వాళ్లతో అక్రమ దందా చేయించింది. కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన కొడుకును.. తాను చేసే కంత్రీ పనుల్లో భాగం చేసింది.
ఇల్లు చక్కదిద్దుకోవడమెలా అని నేర్పించాల్సిన కూతురికి ఇల్లీగల్ పనులు అప్పజెప్పింది. పేదింటి మహిళలతో తప్పుడు పనులు చేయిస్తూ… డబ్బులు వెనకేసుకుంది. ఇంతకూ ఎవరా కిలేడీ…? మేడ్చల్ కమర్షియల్ సరోగసి కేసులో వెలుగులోకి వస్తున్న విస్తుపోయే అంశాలేంటి..?
మేడ్చల్ పరిధిలోని పేట్ బషీరాబాద్‌లో కమర్షియల్ సరోగసి.. అక్రమ ఎగ్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్న కేసు వేగవంతం చేశారు పోలీసులు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లక్ష్మీరెడ్డి చేసిన అక్రమ బాగోతమంతా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. తాను చేసే ఇల్లీగల్ దందాలో కొడుకు, కూతురును కూడా భాగస్వామ్యులను చేసినట్లు గుర్తించారు పోలీసులు…
ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేటకు చెందిన లక్ష్మీరెడ్డి.. హ్యూమన్ ట్రాఫికింగ్‌కి పాల్పడుతూ ముంబై పోలీసులకు పట్టుబడింది. ఈ కేసులో అరెస్ట్ అయి జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చింది. ఈసారి మకాం హైదరాబాద్‌కి మార్చింది. అమీర్‌పేట్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, మాదాపూర్ ప్రాంతాల్లో ఉన్న ఐవీఎఫ్ సెంటర్లు, కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్లతో పరిచయం పెంచుకుంది. అండాలు కావాలన్నా… సరోగసి కోసం అద్దె గర్భానికి మహిళలు కావాలన్నా అరేంజ్ చేస్తానని హాస్పిటళ్లు, ఐవీఎఫ్ సెంటర్లకు ఏజెంట్‌గా వ్యవహరించింది. ఈ దందాలో తన కొడుకు, కూతురును కూడా కలుపుకుంది.
*ఇలా గుట్టుచప్పుడు కాకుండా..*
అక్రమ ఎగ్ ట్రేడింగ్, కమర్షియల్ సరోగసి నడుపుతూ.. లక్షల రూపాయలు వెనకేసుకుంది లక్ష్మీరెడ్డి. ఇదే క్రమంలో ఆమెకు ఓ మహిళ పరిచయం అయింది. ఆ మహిళకు రెండు కిడ్నీలు పాడయ్యాయని.. సర్జరీ చేయాల్సి ఉందని తెలుసుకుంది లక్ష్మీ. ఇదే అదునుగా… లక్ష్మీరెడ్డి ఓ కంత్రీ ప్లాన్ వేసింది. సర్జరీకి అయ్యే ఖర్చంతా తాను పెట్టుకుంటానని.. ఐతే ఆరోగ్యం కుదుటపడ్డాక సరోగసి పద్ధతిలో ఓ బిడ్డను కనివ్వాలని ఒప్పందం చేసుకుంది. ఇందుకు మహిళ కూడా ఒప్పుకుంది.
అనుకున్నవిధంగా లక్ష్మి… తన సొంత డబ్బుతో మహిళకు కిడ్నీ ఆపరేషన్ చేయించింది. కొన్ని రోజుల్లో ఆ మహిళ కోలుకుంది. ఒప్పందం ప్రకారం సరోగసి పద్ధతిలో బిడ్డను కనివ్వాలని కోరింది లక్ష్మి. విషయం తెలుసుకున్న ఆ మహిళ భర్త.. ఇందుకు నిరాకరించాడు. కావాలంటే ఆపరేషన్‌కు అయిన డబ్బంతా తిరిగి ఇస్తామని.. సరోగసీకి మాత్రం ఒప్పుకోమని అన్నాడు. దీంతో.. ఆ దంపతులతో గొడవ పెట్టుకుంది లక్ష్మి. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు మహిళ భర్త. లక్ష్మి పై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లక్ష్మి ఇంట్లో సోదాలు చేశారు.
*పెంట్ హౌజ్‌లో ఆరుగురు గర్భిణీలు*
అప్పుడు కానీ.. అసలు బాగోతం బయటపడలేదు. లక్ష్మీ ఇంటికి సోదాలకు వెళ్లిన పోలీసులు షాక్ అయ్యారు. ఇంటి మేడ మీద ఉన్న పెంట్ హౌజ్‌లో ఆరుగురు మహిళలను గుర్తించారు. అందులో ఇద్దరు 8 నెలల గర్భంతో ఉన్నారు. ఆరా తీస్తే.. వాళ్లంతా సరోగసి కోసం లక్ష్మీ ఎంగేజ్ చేసిన మహిళలుగా గుర్తించారు. సరోగసి పద్ధతిలో బిడ్డలను కనిచ్చేందుకు మహిళలను వివిధ ప్రాంతాల నుంచి లక్ష్మి తీసుకొచ్చినట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు. మేడ్చల్ DM అండ్ HOకి సమాచారం ఇచ్చారు పోలీసులు. లక్ష్మి ఇంట్లో పెద్ద ఎత్తున ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు, పలు హాస్పిటల్స్‌కి చెందిన మెడికల్ రిపోర్ట్లు, ఓపీ షీట్లు స్వాధీనం చేసుకున్నారు. పెంట్ హౌజ్‌లో ఓ లేడీస్ హాస్టల్ ను తలపించే సెటప్ చూసి అవాక్కయ్యారు పోలీసులు.
*ఇంట్లో ఓ డైరీ, కొన్ని నోట్ బుక్స్ స్వాధీనం*
లక్ష్మి.. తన ఇంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న రూమ్‌లను కేవలం బ్యాచ్‌లర్స్‌కి మాత్రమే అద్దెకు ఇస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. బ్యాచ్‌లర్ యువతీ యువకులను మచ్చిక చేసుకుని.. వాళ్లకు డబ్బు ఆశ చూపి వీర్యం, అండాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అద్దెకు ఉన్న వాళ్లను కూడా విచారిస్తున్నారు పోలీసులు. ఇంట్లో ఓ డైరీ, కొన్ని నోట్ బుక్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇప్పటివరకు 50 మంది మహిళలతో సరోగసి పద్దతిలో పిల్లలను కని ఇచ్చినట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు.
తన సంరక్షణలో ఉన్న ఏ మహిళ ఎప్పుడు గర్భవతి అయ్యింది.. ఎప్పుడు డెలివరీ అయ్యింది.. ఎంత డబ్బు ఇచ్చాను.. అనేది పూర్తి వివరాలు డైరీ లో నోట్ చేసుకుంది లక్ష్మి. తన సంరక్షణలో ఉన్న మహిళలకు హిందీ భాషపై శిక్షణ కూడా ఇస్తోంది. రెగ్యులర్‌గా మాట్లాడే మాటలను కొన్ని హిందీలో మాట్లాడేలా ట్రైనింగ్ ఇస్తోంది లక్ష్మి. సరోగసి కోసం ఎక్కువ శాతం నార్త్ ఇండియా దంపతులే వస్తుండటంతో.. వాళ్లకు అద్దె గర్భం ఇచ్చే మహిళ కూడా నార్త్ ఇండియాకి చెందినామే అని నమ్మించేందుకు హిందీ నేర్పిస్తోంది.
లక్ష్మి రెడ్డి ఏజెంట్ వ్యవహరిస్తున్న 6 ప్రైవేట్ హాస్పిటళ్లు, ఐవీఎఫ్ సెంటర్లను గుర్తించారు పోలీసులు. వీటికి నోటీసులు ఇచ్చారు పేట్ బషీరాబాద్ పోలీసులు. మాదాపూర్‌లోని హెగ్డే ఫెర్టిలిటీ హాస్పిటల్, సోమాజిగూడలోని అను టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, బంజారాహిల్స్‌లోని ఫెర్టీ కేర్, ఈవీఏ ఐవీఎఫ్ సెంటర్, అమూల్య ఐవీఎఫ్ సెంటర్, కొండాపూర్ లోని శ్రీ ఫెర్టిలిటీ సెంటర్లకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇప్పటికే అరెస్ట్ ఐన లక్ష్మీరెడ్డి, ఆమె కొడుకు నరేందర్ రెడ్డిలను కస్టడీలోకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు పోలీసులు. కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయనున్నారు. లక్ష్మిఇంట్లో స్వాధీనం చేసుకున్న డైరీ ఇప్పుడు కీలకం కాబోతుంది. అందులోని డేటా ఆధారంగా మరికొందరి బాగోతం బయటపడే అవకాశం ఉంది.. KP