Srikakulam/Lakshminarasupeta (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 31
భారీ వర్షాలు, ప్రాజెక్టుల నీటి పరిస్థితి, పంటల సాగు, ఎల్‌నినో ప్రభావం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి నిర్మల్ కలెక్టరేట్ లో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ప్రాజెక్టుల నీటి పరిస్థితి, పంటల సాగు, ఎల్‌నినో ప్రభావం తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి శుక్రవారం నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుల నీటి నిల్వలు, ఇన్‌ఫ్లో–ఔట్‌ఫ్లో, దెబ్బతిన్న రహదారులు, వంతెనల పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
దెబ్బతిన్న రహదారులు, వంతెనలను వెంటనే మరమ్మతు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. ప్రాజెక్టులకు వస్తున్న ఇన్‌ఫ్లోను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మేరకు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయాలని తెలిపారు.
ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులకు పంట మార్పిడి విధానాలపై విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. అధిక నీటి అవసరమున్న వరికి బదులుగా ఆయిల్‌పామ్, కంది, నువ్వులు, పత్తి వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. కొత్త పంటల సాగుకు అవసరమైన విత్తనాల సరఫరాకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, రైతులు పంటల సాగులో సమతుల్యత పాటించాలని కోరారు. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ, గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండాయని తెలిపారు. దెబ్బతిన్న రహదారుల మరమ్మతు పనులు వేగంగా చేపడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో వర్షాభావ పరిస్థితులు ఎదురైనా ప్రస్తుతం కురిసిన వర్షాలతో తాగునీటి సమస్య ఉండదని పేర్కొన్నారు. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తరిస్తోందని, రైతులకు పంట మార్పిడి విధానాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, గతంలో జిల్లాలో 38 శాతం ఉన్న వర్షపాతం లోటు ప్రస్తుతం 6 శాతానికి తగ్గిందని తెలిపారు. 21 మండలాల్లో 17 మండలాలు సాధారణ వర్షపాతం స్థితికి చేరుకున్నాయని పేర్కొన్నారు. ఇంద్రవెల్లి, భోరజ్, సిరికొండ, బోథ్, గుడిహత్నూర్, ఇచ్చోడ మండలాలు కూడా సాధారణ పరిస్థితికి చేరుకున్నాయని వెల్లడించారు. ఈ ఏడాది జిల్లాలో 5,93,670 ఎకరాల్లో పంటల సాగు నమోదైందని, అందులో 4,37,698 ఎకరాల్లో పత్తి సాగు జరిగిందన్నారు. గత ఏడాదితో పోలిస్తే కంది సాగు 44 వేల ఎకరాల నుంచి 56,751 ఎకరాలకు పెరిగిందని తెలిపారు. సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు వ్యవసాయంతో పాటు తాగునీటి అవసరాలకు ఉపయోగపడనున్నాయని పేర్కొన్నారు.












