రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంలో భాగంగా, ఈ నెల 20 నుండి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. దీనిపై ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, విద్యాలయాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టడం, విద్యార్థులకు క్విజ్, పెయింటింగ్ వంటి పోటీలు నిర్వహించడం, వసతి గృహాలలో మరమ్మత్తు పనులు చేపట్టడం, ప్రత్యేక నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు, వేసవి శిబిరాలు, బడిబాట కార్యక్రమాలను నిర్వహించాలని ప్రధాన కార్యదర్శి సూచించారు. అలాగే, రైతు రిజిస్ట్రేషన్ వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.
నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, జిల్లాలో ఈ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలలో, వసతి గృహాలలో పారిశుద్ధ్యం, మరమ్మత్తు పనులు చేపడతామని, విద్యార్థులకు వివిధ విభాగాలలో పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించడం, వేసవి శిబిరాలు, బడిబాట కార్యక్రమాలను సమన్వయంతో చేపట్టడం, రైతుల రిజిస్ట్రేషన్ వంద శాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం వంటివి జిల్లా స్థాయిలో అమలు చేస్తామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.












