తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఢిల్లీలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని కలిసి, రాష్ట్రంలో బయ్యారం వద్ద గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలను ఆయన కేంద్ర మంత్రుల ముందుంచారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాస వర్మలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పరిశ్రమ స్థాపన ద్వారా ఉక్కు కొరత తీరడమే కాకుండా, పర్యావరణానికి మేలు చేకూరుతుందని తెలిపారు.
‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ నేపథ్యంలో, పాత వాహనాల స్క్రాప్‌తో ఉక్కును రీసైక్లింగ్ చేసే పరిశ్రమను తెలంగాణలో నెలకొల్పాలని సీఎం కోరారు. హైదరాబాద్ నగరాన్ని దేశ పారిశ్రామిక ఉత్పత్తికి కీలక కేంద్రంగా మార్చేందుకు గల అవకాశాలను ఆయన వివరించారు. హైడ్రోజన్ టెక్నాలజీతో గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఆటోమొబైల్, రక్షణ రంగ పరిశ్రమలను ప్రోత్సహించాలని సూచించారు.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను సీఎం నొక్కి చెప్పారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ భేటీలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ కూడా పాల్గొన్నారు.











