తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బీసీ కులాల జనాభా గణాంకాలు, ముఖ్యంగా బీసీ-ఇ వర్గంలోని సంచార ముస్లిం తెగల జనాభాను తగ్గించి చూపాయని తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం ఆరోపించింది. ఈ గణాంకాలను సరిదిద్దాలని సంఘం డిమాండ్ చేసింది.
తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం (BC-E 1-14) ఫౌండర్ & స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ షబ్బీర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బీసీ కులాల జనాభా లెక్కలు వాస్తవ దూరంగా ఉన్నాయని, బీసీ-ఇ వర్గంలోని సంచార ముస్లిం తెగల జనాభాను భారీగా తగ్గించి చూపారని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
క్షేత్రస్థాయిలో వేల సంఖ్యలో ఉన్న సంచార ముస్లిం కుటుంబాలను కేవలం వందల్లో, కొద్ది వేలల్లో చూపడం వెనుక ఉన్న కుట్రను ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, కొన్ని ఉపకులాల జనాభా వాస్తవానికి చాలా తక్కువగా చూపబడిందని, మరికొన్నింటి ప్రస్తావనే లేదని షబ్బీర్ ఆరోపించారు. ఉదాహరణకు, అచ్చుకట్టలవాండ్లు, సింగాలి, సింగంవాళ్లు వర్గానికి 1,340 గృహాలు, 4,532 జనాభా ఉన్నట్లు చూపగా, ఇది కేవలం ఒక మండల జనాభా కంటే తక్కువని ఆయన పేర్కొన్నారు.
ఫకీరు, ఫకీరు బుడబుడక, దర్వేష్ వర్గంలో 13,219 గృహాలు, 46,349 జనాభా ఉన్నట్లు నమోదైంది. అయితే, వాస్తవానికి వీరి సంఖ్య 4 లక్షలకు పైగానే ఉంటుందని షబ్బీర్ తెలిపారు. అదేవిధంగా, గారడి ముస్లిం, గారడి సైబులు వర్గానికి 4,179 గృహాలు, 14,063 జనాభా ఉన్నట్లు చూపగా, వీరి వాస్తవ సంఖ్య 80 వేల నుండి లక్ష వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తురక కాశ, కక్కుకొట్టె జింక సైబులు మొదలైనవి వర్గంలో 13,671 గృహాలు, 46,257 జనాభా ఉన్నట్లు చూపగా, వాస్తవానికి తుర్కా కాశి లు 4 లక్షలకు పైగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం పేర్కొన్న 'స్కోర్' ప్రకారం పరిశీలిస్తే, రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల కంటే సంచార ముస్లింలే అత్యంత దయనీయ స్థితిలో, విద్య, ఆర్థిక మరియు సామాజిక వెనుకబాటుతనంలో అట్టడుగున ఉన్నారని షబ్బీర్ తెలిపారు. వారి జనాభాను తక్కువ చేసి చూపడం వల్ల భవిష్యత్తులో వారికి అందాల్సిన సంక్షేమ పథకాలు, రిజర్వేషన్ ఫలాలు అందకుండా పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తప్పుడు లెక్కలను సరిదిద్ది, శాస్త్రీయ పద్ధతిలో పునఃసమీక్ష జరపాలని, అత్యంత వెనుకబడిన సంచార ముస్లిం తెగలకు ప్రత్యేక ప్యాకేజీ మరియు రక్షణ కల్పించాలని, సంచార ముస్లింల అస్తిత్వాన్ని, వారి కుల ధృవీకరణ పత్రాల జారీలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.












