నిర్మల్, జులై 21
తెలంగాణ పోలీసు ఇంటెలిజెన్స్ విభాగం 2026 తొలి అర్ధవార్షిక సేవా నివేదికలో నిర్మల్ జిల్లా పోలీసు శునక దళం అత్యుత్తమ పనితీరు కనబరిచి రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు అందుకుంది. హత్య, దొంగతనం, మాదకద్రవ్యాల కేసులు వంటి కీలక కేసుల్లో శునకాలు కీలక ఆధారాలు గుర్తించడంలో సహాయపడ్డాయి. ఈ నేపథ్యంలో, శునకాలతో సమన్వయంతో పనిచేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
తెలంగాణ పోలీసు ఇంటెలిజెన్స్ విభాగం విడుదల చేసిన 2026 తొలి అర్ధవార్షిక సేవా నివేదిక (జనవరి-జూన్)లో నిర్మల్ జిల్లా పోలీసు శునక దళం అత్యుత్తమ పనితీరుకు రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు దక్కాయి. ఈ నివేదికలో నిర్మల్ జిల్లా పరిధిలో నమోదైన హత్య, అనుమానాస్పద మృతి, దొంగతనం, ఆలయ చోరీ, మాదకద్రవ్యాల కేసులతో పాటు పలు కీలక కేసుల్లో పోలీసు శునకాలు యామి, జెస్సీ, బోల్ట్ సంఘటన స్థలాల్లో కీలక ఆధారాలను గుర్తించినట్లు పేర్కొన్నారు.
నిందితుల జాడలను కనిపెట్టడం, దర్యాప్తును వేగవంతం చేయడంలో శునక దళం విశేష పాత్ర పోషించినట్లు నివేదికలో ఉంది. ఈ సందర్భంగా శునకాలతో సమన్వయంగా విధులు నిర్వహించి, కేసుల ఛేదనలో కీలక పాత్ర పోషించిన ఏఆర్పీసీ జి. పరమేశ్వర్, ఏఆర్పీసీ కె. శ్రీనివాస్, ఏఆర్పీసీ జి. సాయేందర్ లను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు.












