మిర్యాలగూడ, జూలై 21
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 2 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు గౌడ్ తెలిపారు. మిర్యాలగూడలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. పెన్షన్, ఎక్స్ గ్రేషియా పెంపు, రక్షణ కవచం వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఆయన కోరారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో భాగంగా గీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 2 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు గౌడ్ తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలోని వృత్తిదారుల కార్యాలయంలో సంఘం మండల అధ్యక్షులు బోడ వెంకన్న అధ్యక్షతన కల్లుగీత కార్మిక సంఘం మిర్యాలగూడ మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెన్షన్ రూ.4000కు, ఎక్స్ గ్రేషియా రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పిన హామీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వృత్తిలో ప్రమాదం జరిగిన వారికి ఇవ్వాల్సిన ఎక్స్ గ్రేషియా ఇంతవరకు మంజూరు చేయడం లేదని, అధికారంలోకి వచ్చి 34 నెలలు గడిచినా వీటిని అమలు చేయకపోవడం దారుణమని ఆయన అన్నారు. వీటిని వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పాలని, వృత్తి చేసే వారందరికీ వెంటనే కాటమయ్య రక్షణ కవచం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర బస్సు యాత్ర ఆగస్టు 2న మహబూబాబాద్‌లో ప్రారంభమై, అన్ని జిల్లాల్లో ప్రచారం నిర్వహించి, 18న హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ముగుస్తుందని తెలిపారు. ఈ యాత్రలో గీత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బస్సు యాత్ర ఆగస్టు 6న నల్గొండ జిల్లాకు వస్తుందని, అక్కడి నుంచి ర్యాలీతో నకిరేకల్ రోడ్ షో, నల్గొండ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో ఫంక్షన్ హాల్లో సభ జరుగుతాయని పేర్కొన్నారు. ఆ తర్వాత మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో రోడ్ షో నిర్వహిస్తామని, ఈ రోడ్ షోను మిర్యాలగూడ మండల, నియోజకవర్గ పరిధిలోని కల్లుగీత కార్మికులు, గౌడులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు జయప్రదం చేయాలని కోరారు. కార్మికుల సమస్యలపై అధ్యయనం చేస్తూ యాత్ర కొనసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంఘం మండల కార్యదర్శి చెనగాని లక్ష్మయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మగ్తాల లింగస్వామి, సంఘం ఉపాధ్యక్షులు కర్నాటి లక్ష్మయ్య, జాజుల అంజయ్య, మారగాని లింగయ్య, అయితగాని పాపయ్య, పోతునూరు లక్ష్మయ్య, నరహరి, పురుషోత్తం, మాధవ రాములు, చెనగాని శ్రీరాములు పాల్గొన్నారు.












