మిర్యాలగూడ, జూన్ 29
మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డిఓ ఎస్.రమణారెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి 19 ఫిర్యాదులు అందాయి. భూ సంబంధిత, పంపిణీ సమస్యలపై వచ్చిన వాటిని వెంటనే సంబంధిత అధికారులకు పంపాలని ఆర్డిఓ ఆదేశించారు.
మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో ఆర్డిఓ ఎస్.రమణారెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన డివిజన్ స్థాయి ప్రజావాణికి అత్యధికంగా 19 ఫిర్యాదులు అందాయి. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ఈసారి మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్ కార్యాలయానికి 10, మిర్యాలగూడ తహసీల్దార్ కార్యాలయానికి 6, మాడ్గులపల్లి తహసీల్దార్ కార్యాలయానికి ఒకటి, పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయానికి 2 ఫిర్యాదులు వచ్చాయి.
ఈ సందర్భంగా ఆర్డిఓ రమణారెడ్డి మాట్లాడుతూ, భూ సంబంధిత, పంపిణీ తదితర సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే సంబంధిత అధికారులకు పంపాలని ఆదేశించారు. ప్రతి రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో గ్రామీణ ప్రజల సౌకర్యార్థం ప్రజావాణి నిర్వహిస్తున్నామని, ప్రజల అర్జీలను స్వీకరించి సత్వరం పరిష్కరించాలని అధికారులను కోరారు. అందుబాటులో ఉన్న డివిజన్ స్థాయి ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో తహసీల్దార్ పి. శ్రీనివాస్, డిఎల్పిఓ రాఘవరావు, వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె.జగదీశ్వర్‌రెడ్డి, ఎంఎఓ ఎం.ఋష్యెంద్రమణి, మునిసిపాలిటీ మేనేజర్ జి.జ్ఞానేశ్వరి, ఐసిడిఎస్ మిర్యాలగూడ అర్బన్ పిఓ వేణుగోపాల్, ఉద్యానవన శాఖ డివిజన్ అధికారి నసీమా మెహ్రిన్, ఎంపిఓ ఎం.రమేష్, నీటిపారుదల శాఖ ఆర్ అండ్ బి, నీటిపారుదల, ఆర్ డబ్ల్యూఎస్, హౌజింగ్ డిఇఇలు శ్రీనివాస్, ఎండి.అహ్మదుల్లా, జనార్దన్, ఎక్సైజు ఎస్ఐ షేక్ పర్వీన్, హెచ్ డబ్ల్యూఒ జానిమియా పాల్గొన్నారు.












