ఆదిలాబాద్, 21 July
ఆదిలాబాద్ జిల్లాలోని భోరాజ్ మండలంలో చేపడుతున్న మహిళా గ్రామ సంఘాల భవనాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, పెరటి తోటల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మండల ఎంపీడీవో లంక నర్సింగ్ రావు, ఎంపీఓ రమేష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని నాలుగు గ్రామ పంచాయతీల్లో పర్యటించి, నిర్మాణ పనులను పరిశీలించారు.
నూతనంగా ఏర్పడిన భోరాజ్ మండలంలోని నిరాల, బాలాపూర్, పెండల్ లవాడ, సావాపూర్ గ్రామ పంచాయతీల పరిధిలో చేపడుతున్న మహిళా గ్రామ సంఘాల భవనాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, పెరటి తోటల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని భోరాజ్ మండల ఎంపీడీవో లంక నర్సింగ్ రావు, ఎంపీఓ రమేష్ కోరారు.
మంగళవారం బోరోజ్ మండలంలోని ఈ నాలుగు గ్రామ పంచాయతీల్లో క్షేత్రస్థాయికి వెళ్లి, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను, మహిళా గ్రామ సంఘాల భవనాల స్థలాలను పరిశీలించి, పనులను వెంటనే వేగవంతం చేయాలని పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, గ్రామ సంఘాల అధ్యక్షులను ఆదేశించారు.
సావాపూర్ గ్రామంలో ఏర్పాటుచేసిన వైద్య ఆరోగ్య పరీక్షల క్యాంపును పరిశీలించిన ఎంపీడీవో, బిపి, షుగర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఆరోగ్య శాఖ సిబ్బంది పలు రోగాలకు సంబంధించిన మందులను పంపిణీ చేస్తున్నారని తెలిపారు.
అనంతరం గ్రామంలోని గ్రామస్తులకు, మహిళలకు సావాపూర్ సర్పంచ్ లక్ష్మీబాయి, ఉప సర్పంచ్ సునీల్ తో కలిసి చెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో తిరుగుతూ, గ్రామ ప్రజలందరూ సమిష్టి కృషితో, ఐక్యంగా కలిసిమెలిసి ఉండి, చెత్తాచెదారాన్ని ఎక్కడపడితే అక్కడ పారేయకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులను కోరారు. గ్రామం ఎంత పరిశుభ్రంగా ఉంటే, ఆ గ్రామంలోని వారందరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.
ఎంపీఓ రమేష్ మాట్లాడుతూ, గ్రామంలోని సమస్యలను ఎప్పటికప్పుడు గ్రామస్థాయిలో పరిష్కరిస్తూ, పరిష్కారం కాని పక్షంలో తమ దృష్టికి తీసుకువస్తే, సమస్య పరిష్కారానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి పాఠశాలలో పెరటి తోటలు పెంచాలని, వాటిని కాపాడితే, పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు తాజా కూరగాయలను అందించడానికి ఉపయోగపడతాయని అన్నారు.
సావాపూర్ ప్రాథమిక పాఠశాలను ఎంపీడీవో, ఎంపీఓ, సర్పంచ్, గ్రామస్తులు తనిఖీ చేసి, పాఠశాల ఆవరణంలోని పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మహిళా గ్రామ సంఘాల భవనాల నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్, డిఆర్డిఏ, సెర్ప్ ఏపిఎం మాధవ, పంచాయతీ కార్యదర్శులు నితారాణి, గేడం సూర్య, సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచులు సునీల్, ఇస్తారి, పంచాయతీ సెక్రెటరీలు, గ్రామ సంఘాల అధ్యక్షులు, వివో, ఏలు, గ్రామస్తులు, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











