హైదరాబాద్, జూలై 21, 2026
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా, ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వికలాంగుల డైరెక్టర్ సత్యనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం అమలు చేయలేదని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వికలాంగుల డైరెక్టర్ సత్యనారాయణ గారిని మలక్‌పేటలోని ఆయన కార్యాలయంలో కలిసి ప్రత్యేక వినతిపత్రం అందజేసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా గిద్దె రాజేష్ మాట్లాడుతూ... ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల పింఛన్‌ను రూ.6,000లకు పెంచుతామని, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా మారుస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రంలోని దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేకించి, కాంగ్రెస్ పార్టీ AICC ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా జనాభా దామాషా ప్రకారం వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే రాబోయే గ్రేటర్ హైదరాబాద్ (GHMC) ఎన్నికలను నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వికలాంగుల ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ అంశాన్ని వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి, స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు కల్పించేలా తెలంగాణ అసెంబ్లీని సమావేశపరిచి ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వికలాంగుల హక్కుల చట్టం–2016 (RPwD Act) స్ఫూర్తికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కమిషనర్‌గా అర్హత కలిగిన వికలాంగుడినే నియమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గిద్దె రాజేష్ విజ్ఞప్తి చేశారు.
ఒకవేళ ఈ కీలక అంశాలను సాధించలేకపోతే, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు వికలాంగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయించలేకపోయిన తన పరిపాలన తీరుపై తానే ఆత్మవిమర్శ చేసుకుని వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి పదవికి అడ్లూరి లక్ష్మణ్ వెంటనే రాజీనామా చేయాలని గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.












