మహిళలందరూ అక్షరాస్యులుగా మారాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా షాబాద్ మండల స్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా ఇప్పటికే అనేక మండలాల్లో మహిళలను బస్సుల యజమానులను చేశామని చైర్మన్ తెలిపారు. కొత్త బస్సులు కొనుగోలు చేయడం, నిర్వహించడం వంటి బాధ్యతలను మహిళలకు అప్పగించడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తున్నట్లు ఆయన వివరించారు.
బస్సులతో పాటు సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల వంటి వ్యాపారాలలో కూడా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామని, మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, రాబోయే మూడు నెలల్లో 8000 భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. అక్షరాస్యతను పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని, మహిళలు తమ హక్కుగా స్థలాలను పొందడంలోనూ ప్రభుత్వం సహకరిస్తోందని ఆయన పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని, 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.












