కుంటాల మండల కేంద్రంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల స్థాయి సమీక్ష సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ నివేదికలను సమర్పించగా, కల్లూరు సర్పంచ్ పలు పెండింగ్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
కుంటాల మండల కేంద్రంలోని మున్నూరు కాపు ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి మండలంలోని 15 గ్రామ పంచాయతీల సర్పంచులు, ఉపసర్పంచులు, పంచాయతి కార్యదర్శులు హాజరయ్యారు. జిల్లా పంచాయతి అధికారి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, ఎంపీడీవో అల్లాడి వనజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను, పథకాల అమలు స్థితిగతులను ప్రజెంటేషన్ల ద్వారా వివరించారు. పంచాయతీ రాజ్, రెవెన్యూ, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, సంక్షేమ శాఖల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా కళాకారుల ప్రదర్శనలు కూడా జరిగాయి.
కల్లూరు సర్పంచ్ పెంటే వార్ దశరథ్ మాట్లాడుతూ, ప్రజాపాలన దరఖాస్తుల్లో లోపాలను సవరించాలని కోరారు. 2019 నుంచి పీఎం కిసాన్ నిధులు అందకపోవడం, ఇందిరమ్మ ఇళ్ల చివరి బిల్లులు పెండింగ్లో ఉండటం, పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణంలో జాప్యం వంటి సమస్యలను ఆయన ప్రస్తావించారు. డాక్టర్ బదిలీ సమస్యను కూడా లేవనెత్తారు.
ఈ సమస్యలపై తక్షణ పరిష్కారం కోసం నివేదికలు పంపాలని సర్పంచ్ అధికారులను కోరారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి మహిళలు, రైతులు, యువకులు, వివిధ విభాగాల సిబ్బంది కూడా హాజరయ్యారు.












