తొలి, మలి దశ ఉద్యమాలతోనే తెలంగాణ రాష్ట్రం సాధించబడిందని, జూన్ 2న రాష్ట్ర సాధన దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించాలని ఉద్యమకారులు పిలుపునిచ్చారు. మిర్యాలగూడలో జరిగిన 'చాయ్ పే చర్చ' కార్యక్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
మిర్యాలగూడ ఎన్ఎస్పి క్యాంపులోని ఇందిరా క్యాంటీన్ వద్ద బుధవారం సాయంత్రం జరిగిన ఈ చర్చలో ఉద్యమ తీరు, మలి దశ ఉద్యమంలో జరిగిన కార్యక్రమాలపై సమీక్షించారు. రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులను గుర్తించి, ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరథ నాయక్, సీనియర్ జర్నలిస్టు ఖాజాహామీదుద్దీన్, బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు, తొలి దశ తెలంగాణ ఉద్యమ సంఘం అధ్యక్షులు లింగయ్యలు అన్నారు.
ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ప్రాణత్యాగం చేసిన వారికి, జైలు పాలైన వారికి ప్రాధాన్యత ఇచ్చి ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటారని వారు తెలిపారు. రాష్ట్ర సాధన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉద్యమకారులను గుర్తించి గౌరవించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం నాయకులు, ఆర్టీసీ నాయకులు ఎండి.ఇక్బాల్, కిషోర్, డైమండ్ చిన్న, గంధం సైదులు, చిదళ్ళ సత్యనారాయణ, వేముల లింగయ్య, వరగాని కృష్ణమూర్తి, తడకమళ్ళ విజయకుమార్, మన్నెం లక్ష్మయ్య, కుక్కడపు మల్లయ్య, చిట్టిపోలు లింగయ్య, జయరాజు, రాపోలు పరమేష్, ఈశ్వరాచారి పాల్గొన్నారు.












