తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలులో సమూల మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది. ఆర్థిక భారం తగ్గించుకుంటూ, అర్హులైన రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా ఈ పథకాన్ని పునఃసమీక్షిస్తున్నట్లు సమాచారం. ఈనెల 30న ఖమ్మం జిల్లా మధిరలో ముఖ్యమంత్రి నిధులను విడుదల చేయనున్నారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభం నేపథ్యంలో, పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. సుమారు 73 లక్షల మంది రైతులకు రూ. 9,000 కోట్లు జమ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ సాయం అందడంతో కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. ఈసారి ఆ పరిస్థితి రాకుండా అందరికీ ఒకేసారి నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
అర్హులైన రైతులకు మాత్రమే పథకం వర్తింపజేయాలనే లక్ష్యంతో, సాగుకు పనికిరాని భూములు, రియల్ ఎస్టేట్ లేఅవుట్లు, కాలువలు, కుంటలు, బీడు భూములు వంటి సుమారు 20 నుంచి 25 లక్షల ఎకరాలను భరోసా జాబితా నుంచి తొలగించనున్నారు. దీని ద్వారా కేవలం నిజమైన, సాగు చేసే రైతులకు మాత్రమే ఈ సాయం అందేలా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోనుంది.
ధనవంతులైన పెద్ద రైతులకు కాకుండా, పేద, మధ్యతరగతి రైతులకు లబ్ధి చేకూర్చేలా ఈ వానాకాలం సీజన్ నుంచి 7.20 గుంటల వరకు భూమి ఉన్న వారికే భరోసా సాయం పరిమితం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారిని ఈ జాబితా నుంచి మినహాయించే అవకాశం ఉంది. అలాగే, పత్తి వంటి పంటలు రబీలో సాగు చేయనందున, రైతు భరోసాను కేవలం ఒకే ఒక ప్రధాన ఖరీఫ్ సీజన్‌కు పరిమితం చేయాలా అనే దానిపై కూడా పరిశీలన జరుగుతోంది.
రైతు భరోసాలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా హైటెక్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో స్విట్జర్లాండ్ దేశానికి చెందిన సార్ మ్యాప్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని, శాటిలైట్ చిత్రాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించారు. ఈ సర్వే ద్వారా ఏ గ్రామంలో, ఏ సర్వే నంబర్లో, ఏ పంట వేశారనేది 95 శాతం ఖచ్చితత్వంతో గుర్తించారు. ఈ డేటా ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోతే నష్టపరిహారం అందించడానికి, విత్తనాలు-ఎరువులు సిద్ధం చేసుకోవడానికి ఉపయోగపడనుంది.












