రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో పార్టీ శ్రేణులు ముందుండి పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. బోథ్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా కుంటాల మండలంలో రైతుల సమస్యలపై ఆయన ఆరా తీశారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే స్పందించి అండగా నిలవాలని నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు. మక్క, జొన్నల కొనుగోలు విషయంలో రైతుల తరఫున పోరాడుతూ వారికి అండగా నిలిచిన కుంటాల మండల బీఆర్ఎస్ కన్వీనర్ పడకంటి దత్తాత్రేయను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
రైతు సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకువస్తూ, వారి హక్కుల కోసం కృషి చేస్తున్న దత్తాత్రేయ సేవలను కేటీఆర్ ప్రశంసించారు. రైతుల ప్రయోజనాల కోసం ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.
అవసరమైతే నియోజకవర్గ స్థాయి నాయకుల సలహాలు, సూచనలు తీసుకుని రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
రైతు ప్రయోజనాల పరిరక్షణ కోసం పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజల్లో ఉండాలని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు లోలం శ్యాంసుందర్, డాక్టర్ కిరణ్, కొమరేవార్ విలాస్, గాదేవార్ కల్లూరు సర్పంచ్ దశరథ్, బాసర్ కన్వీనర్ శ్యాంసుందర్, వంశీ తదితరులు పాల్గొన్నారు.











