వర్షాకాలంలో ఆకస్మిక వరదలు సంభవించినప్పుడు ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌ను సందర్శించిన ఎన్డీఆర్ఎఫ్ బృందంతో ఆయన ఈ విషయమై చర్చించారు.
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ, వర్షాకాలంలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించి, ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే, వారి సహాయార్థం ఎన్డీఆర్ఎఫ్ బృందం సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ ఆకస్మిక విపత్తులను ఎదుర్కోవడానికి ముందస్తు ప్రణాళిక ఎంత అవసరమో ఆయన నొక్కి చెప్పారు.
ఎన్డీఆర్ఎఫ్ బృందం జిల్లాలో విధులు నిర్వర్తించే సమయంలో వారికి అవసరమైన అన్ని వసతి సౌకర్యాలను జిల్లా యంత్రాంగం కల్పిస్తుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. వర్షాకాలం మొత్తం అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే తక్షణమే స్పందించాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డీఆర్ఓ రమేష్ రాథోడ్, ఆర్డిఓ దేవిదాస్, ఎన్డిఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ జిడి ముఖేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం జిల్లాలో సహాయక చర్యలు చేపట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది.












