తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూ డబ్ల్యూజే-ఐజేయు) అనుబంధ సంఘం ఆధ్వర్యంలో జూన్ 3వ తేదీన నకిరేకల్ లోని వినాయక ఫంక్షన్ హాల్ లో జరగనున్న నల్లగొండ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని మాజీ జిల్లా కార్యదర్శి, మిర్యాలగూడ మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎండి ఫక్రుద్దీన్ (అస్లాం) జర్నలిస్టులకు పిలుపునిచ్చారు.
మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కలిమెల నాగయ్యల నేతృత్వంలో జరగనున్న ఈ మహాసభకు నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి, టీయూ డబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రామనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీ. ప్రభాకర్ రెడ్డి వంటి ప్రముఖులు హాజరుకానున్నారని అస్లాం తెలిపారు.
జిల్లాలోని జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం టీయూడబ్ల్యూజే నిరంతరం కృషి చేస్తుందని, ఈ మహాసభలో జర్నలిస్టుల సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశం జర్నలిస్టుల సంక్షేమానికి, వృత్తిపరమైన ఎదుగుదలకు దోహదపడే కీలక నిర్ణయాలకు వేదిక కానుంది.
జిల్లాలోని అన్ని మండలాల, పట్టణాల నుంచి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాలని అస్లాం విజ్ఞప్తి చేశారు. మహాసభ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి పలువురు నాయకులు ఇప్పటికే నకిరేకల్ కు చేరుకున్నారు.











