రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సమావేశం కానుంది. 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం' ప్రారంభం, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణ, ఆర్టీసీ విలీనం, ఉద్యోగుల సమస్యలు వంటి పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది.
రాష్ట్ర సచివాలయంలోని క్యాబినెట్ మీటింగ్ హాల్లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశానికి అవసరమైన సమాచారంతో సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులను ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు కీలక నిర్ణయాలు ప్రకటించనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం'ను జూన్ 2న ప్రారంభించే అవకాశాలున్నాయని సమాచారం. ఈ పథకం కింద రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున జీవిత బీమా కల్పించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పథకం అమలు సాధ్యాసాధ్యాలను క్యాబినెట్ పరిశీలించనుంది. ఈ పథకానికి బడ్జెట్లో రూ.4 వేల కోట్లు కేటాయించారు.
మే నెలలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణపై కూడా క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల తుది జాబితాను ఖరారు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అదేవిధంగా, గవర్నర్ కోటా కింద ప్రతిపాదించిన ఎమ్మెల్సీల అంశం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్, ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ డీఏల విడుదల వంటి అంశాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
యాసంగి ధాన్యం సేకరణ, వడగళ్ల వానతో జరిగిన పంట నష్టం, కుల సర్వే వివరాలపై ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్పై కూడా క్యాబినెట్ చర్చించనుంది. మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకోవడం, నిధుల చెల్లింపు, రోహిత్ వేముల వివక్ష నిరోధక చట్టం వంటి అంశాలు కూడా చర్చల్లో భాగంగా ఉండే అవకాశం ఉంది.












