నిర్మల్ జిల్లాలోని చారిత్రక బత్తిస్ ఘడ్ కోటలో ఒక రహస్య మెట్లబావిని చరిత్ర పరిశోధకులు కనుగొన్నారు. శతాబ్దాల నాటి ఈ నిర్మాణం సైనిక స్థావరంగా, రహస్య మార్గంగా ఉపయోగపడిందని భావిస్తున్నారు. దీని సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
నిర్మల్ జిల్లాలో ఉన్న చారిత్రక కోటల్లో అద్భుతమైన ఆవిష్కరణలు వెలుగుచూస్తున్నాయి. అందులో భాగంగా, నిర్మల్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక రాజుల కాలం నాటి బత్తిస్ ఘడ్ కోటలో ఒక రహస్య మెట్లబావిని ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకులు డాక్టర్ తుమ్మల దేవరావ్ గుర్తించారు. కోటను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ విశేషం వెలుగులోకి వచ్చిందని ఆయన తెలిపారు.
ఈ మెట్లబావి కోటకి తూర్పు వైపున రహస్యంగా నిర్మించబడిందని, సముద్రమట్టానికి సుమారు 500 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కోటలో నీటి జాడలు లేనప్పటికీ, దీనిని సైనిక స్థావరంగా ఉపయోగించుకున్నారని డాక్టర్ దేవరావ్ వివరించారు. శత్రువులు కోటను ఆక్రమించినప్పుడు సైనికులు తప్పించుకోవడానికి ఈ మెట్లబావిని రహస్య మార్గంగా నిర్మించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
సుమారు 200 మెట్లు దిగితే చేరుకునే ఈ బావి, పూర్తిగా బలమైన రాళ్లతో నిర్మించబడింది. ఇది నీటి అవసరాల కోసం కాకుండా, సైనికులకు ఒక రహస్య స్థావరంగా ఉపయోగపడిందని నిర్మాణ శైలి తెలియజేస్తోంది. బావి చుట్టూరా సైనికులు పహారా కాసేందుకు, బయటివారిని గమనించడానికి కోట గోడలకు రహస్య రంధ్రాలు ఏర్పాటు చేశారు. బావి అడుగుభాగం నుంచి ఒక మీటరు వైశాల్యంతో సొరంగ మార్గం కూడా ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఈ సొరంగం ద్వారా శత్రువులు వేరే కోటలోకి లేదా సోన్ గాడికి చేరుకునేవారని స్థానికంగా కథలు ప్రచారంలో ఉన్నాయి.
తెలంగాణలోని అనేక మెట్లబావులతో పోలిస్తే, బత్తిస్ ఘడ్ లోని ఈ రహస్య మెట్లబావి చాలా విశిష్టమైనదని చరిత్ర పరిశోధకులు పేర్కొంటున్నారు. వందల ఏళ్ల నాటి ఈ అద్భుత నిర్మాణాన్ని శిథిలం కాకుండా సంరక్షించుకుంటూ, పర్యాటకులకు అందుబాటులోకి తేవాలని డాక్టర్ తుమ్మల దేవరావ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ పరిశోధనలో అబ్బడి రాజేశ్వర్ రెడ్డి, మారుతి తదితరులు పాల్గొన్నారు.











