తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల బీభత్సం వల్ల పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు, పిడుగుపాటుకు ఒక రైతు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్రంలోని నల్లగొండ, వరంగల్, సూర్యపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నల్లగొండ జిల్లాలో ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసిపోగా, పలు చోట్ల చెట్లు విరిగిపడటంతో రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా అద్దంకి–నార్కట్పల్లి హైవేపై చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది.
నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. చేతికొచ్చిన పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లి గ్రామంలోని ఐకెపి కేంద్రంలో పిడుగుపాటుకు రైతు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన నష్టంపై అధికారులు ప్రాథమిక అంచనాలు సేకరిస్తున్నారు.
ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఉరుములు, మెరుపుల సమయంలో బయట తిరగడం, చెట్ల కింద నిలబడటం వంటివి చేయవద్దని అధికారులు సూచించారు.








