తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో నష్టం వాటిల్లడంతో పాటు, చేతికొచ్చిన పంటలు దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిసిపోవడం, ప్రధాన రహదారులపై చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
తిప్పర్తి మండలంలో అద్దంకి-నార్కట్ పల్లి హైవేపై చెట్లు విరిగిపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నకిరేకల్, కట్టంగూర్, కేతెపల్లి మండలాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది.
ఉమ్మడి వరంగల్, సూర్యపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో కూడా వాతావరణం ఒక్కసారిగా మారి, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వాన కురిసింది. దీంతో చేతికొచ్చిన పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు.











