ఖానాపూర్ పట్టణంలో "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" నియోజకవర్గ సమావేశం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో జరిగింది. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు సకాలంలో, సమర్థవంతంగా చేరాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం అమలు జరుగుతోందని అధికారులు తెలిపారు.
శనివారం జేకే ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ, "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" ముఖ్య ఉద్దేశ్యం ప్రభుత్వ ఫలాలు ప్రజలకు మెరుగ్గా అందించడమేనని అన్నారు. నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఈ దిశగా జరుగుతున్నాయని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యం, విద్య, వైద్యం వంటి రంగాల్లో ఇప్పటికే అనేక కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు.
త్వరలో ఇందిరమ్మ జీవిత బీమా, ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం వంటి మరిన్ని నూతన పథకాలు ప్రారంభం కానున్నాయని కలెక్టర్ వెల్లడించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం డివిజన్ స్థాయిలలో ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దరఖాస్తుల పరిష్కారానికి నిర్దిష్ట గడువు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల పదవ తరగతి పరీక్షా ఫలితాలలో నిర్మల్ జిల్లా ఉత్తమ స్థానంలో నిలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజలతో మమేకం కావడానికి "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" అనే 99 రోజుల ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తోందని తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గానికి 6,155 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, 53 వేల కుటుంబాలకు 200 యూనిట్ల సబ్సిడీ విద్యుత్ అందుతుందని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా వంటి పథకాలు పేదల అభ్యున్నతికి దోహదపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు విద్యాభివృద్ధికి ప్రభుత్వం చొరవ చూపుతోందని ఎమ్మెల్యే తెలిపారు. ఇటీవల జరిగిన ప్రమాదాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా, పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, ప్రభుత్వ విద్యాసంస్థలను కలెక్టర్, ఎమ్మెల్యే అభినందించారు. మహిళా సంఘాలకు చెక్కులు, దివ్యాంగులకు స్కూటీలు, ల్యాప్టాప్లు పంపిణీ చేశారు.








