కుంటాల-ఓలా ప్రధాన రహదారిపై ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు, బబ్బిలి చెట్లను తొలగించే పనులు చేపట్టారు. గ్రామ సర్పంచ్ జక్కుల గజేంధర్ చొరవతో చేపట్టిన ఈ చర్యలు రహదారిని సుగమం చేయడంతో పాటు ప్రమాదాల నివారణకు దోహదపడనున్నాయి.
కుంటాల మండలంలో కుంటాల-ఓలా ప్రధాన రహదారిపై ఇరువైపులా అడవి మొక్కలు, బబ్బిలి చెట్లు ఏపుగా పెరిగిపోవడంతో రహదారి ఇరుకుగా మారి వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని మలుపుల వద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉండేది.
ఈ సమస్యను గుర్తించిన గ్రామ సర్పంచ్ జక్కుల గజేంధర్ వెంటనే స్పందించి, గ్రామ శివారు వరకు రహదారి ఇరువైపులా పెరిగిన మొక్కలను తొలగిస్తూ చదును చేసే పనులు చేపట్టారు. దీనివల్ల రహదారి విస్తీర్ణం పెరిగి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన మార్గం అందుబాటులోకి వచ్చింది.
సర్పంచ్ తీసుకున్న ఈ ముందడుగును స్థానికులు, వాహనదారులు అభినందిస్తున్నారు. ప్రమాదాల నివారణతో పాటు గ్రామ ప్రజల భద్రతకై ఇలాంటి చర్యలు మరింత అవసరమని వారు అభిప్రాయపడ్డారు. గ్రామాభివృద్ధి, ప్రజా భద్రత విషయంలో చురుకుగా వ్యవహరిస్తున్న సర్పంచ్ జక్కుల గజేంధర్ చర్యలు ఆదర్శంగా నిలుస్తున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు.
ఈ పనుల వల్ల వాహనాల రాకపోకలు సులభతరం కావడమే కాకుండా, రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆశిస్తున్నారు. ఇది స్థానిక ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా మారింది.








