స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్ఐఆర్ అమలు విధానంపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో చేపట్టబోయే ఎస్ఐఆర్ ప్రక్రియలో నిజమైన ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా ప్రతి దశను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జూన్ 15 నుంచి 24 వరకు సన్నాహక చర్యలు, శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు), ఎన్నికల సిబ్బందికి పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఎస్ఐఆర్ నిబంధనలు, విధివిధానాలు, ఫీల్డ్ వెరిఫికేషన్, ఫారాల నిర్వహణ తదితర అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఓటరు ప్రోజెనీ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశించారు. మ్యాపింగ్లో ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా క్షేత్రస్థాయిలో జాగ్రత్తగా పరిశీలనలు చేపట్టాలని పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ అమలుకు అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. అధికారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఎన్నికల ప్రక్రియపై పూర్తి స్పష్టత కల్పిస్తామని తెలిపారు.











