ముందస్తు అప్రమత్తత ద్వారానే విపత్కర సమయాల్లో నష్టపోకుండా ఉండగలుగుతామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే విపత్తులను ఎదుర్కోవడానికి సన్నద్ధతపై నిర్వహించనున్న మాక్ ఎక్సర్సైజ్ వివరాలను అధికారులు సమీక్షించారు.
కేంద్ర పర్యావరణ విపత్తు సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ డైరెక్టర్ మేజర్ జనరల్ సుధీర్ బేహాల్, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ హరిచందన దాసరి శుక్రవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ, ఈ నెల 18వ తేదీన వైఎస్ఆర్ కాలనీలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేలా మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు అందరూ భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు.
ఇటువంటి ముందస్తు సన్నద్ధత ద్వారా ప్రజల్లో విపత్కర పరిస్థితుల సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై అవగాహన పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ముందస్తు చర్యల వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించవచ్చని ఆయన తెలిపారు.
ఈ వీసీలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, అగ్నిమాపక శాఖ అధికారి ప్రభాకర్, సిపిఓ జీవరత్నం, డిఎంహెచ్ఓ రాజేందర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.











