తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించడానికి అంగీకరించడంతో, మిర్యాలగూడ ఆర్టీసీ డిపో ఉద్యోగులు శనివారం ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు.
ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టీసీ కార్మికుల కృషిని ప్రభుత్వం గుర్తించి, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం పట్ల కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. సమ్మెకు మద్దతు తెలిపిన స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు లకు కార్మికులు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా, ఆత్మాహుతి చేసుకున్న నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ కు నివాళులు అర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో రీజియన్ కార్యదర్శి కడియం రమేష్, డిపో కార్యదర్శి భాగ్యరాజు, ఉపాధ్యక్షులు వెంకన్న, మేళ్ళ వెంకటేశ్వర్లు, హాథిరాం నాయక్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.












