ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గొని, ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు.
కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, ప్రజల సమస్యలను పరస్పర సమన్వయంతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించారు. ఈ సమస్యలపై అధికారులు సత్వరమే స్పందించి పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేసి, నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మండల ప్రత్యేక అధికారులు ప్రభుత్వ వసతి గృహాలను నిరంతరం తనిఖీ చేయాలని తెలిపారు. ముఖ్యమంత్రి బాసర పర్యటన విజయవంతం కావడానికి కృషి చేసిన అధికారులను ఆమె అభినందించారు.












