జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ప్రజా సమస్యలకు పారదర్శకంగా, తక్షణ పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
నిర్మల్ జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో, నిర్మల్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆర్జీదారుల నుండి జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల ముందే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ల ద్వారా ఆదేశాలు జారీ చేసి, బాధితులకు చట్టపరంగా అందాల్సిన సహాయాన్ని అందిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యమని, ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వినతులు, ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందని ఆమె పేర్కొన్నారు.
గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్లో పొందుపరుస్తూ, అవి ఏ మేరకు పరిష్కారం అయ్యాయో అని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా వారి సమస్యలను మా దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు.
గ్రీవెన్స్ డేలో వచ్చిన ప్రతి ఫిర్యాదు పైన సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసి, ఫాలోఅప్ చర్యలు తీసుకుంటున్నామని, సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా పర్యవేక్షణ చేస్తామని ఎస్పీ చెప్పారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పారదర్శక విధానంలో చర్యలు తీసుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ఆమె పునరుద్ఘాటించారు.








