మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జవహర్‌నగర్ డివిజన్లో భవన నిర్మాణ, హమాలి కార్మికుల కోసం రూ.5 భోజనం పథకం కింద ఇందిరమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు.
మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు చింతకింది అశోక్ మాట్లాడుతూ, అడ్డా కార్మికులు రోజువారీ కూలీ దొరక్క ఇబ్బందులు పడుతున్నారని, చాలామంది అర్ధాకలితోనే జీవిస్తున్నారని తెలిపారు. జవహర్‌నగర్ బాలాజీ నగర్ అడ్డా వద్ద సుమారు 300 మంది కార్మికులు ఉపాధి కోసం ప్రతిరోజూ వేచి చూస్తున్నారని పేర్కొన్నారు.
కార్మికుల దుస్థితిని పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వం రూ.5 భోజనం పథకం కింద ఇందిరమ్మ క్యాంటీన్‌ను అడ్డా ప్రాంతంలో ఏర్పాటు చేయాలని సిఐటియు నాయకులు కోరారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వినతిపై కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్. వసంత సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. వీలైనంత త్వరగా రూ.5 భోజనం పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చినట్లు సమాచారం. కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు కీసర మండల కార్యదర్శి బంగారు నర్సింగ్ రావు, సిఐటియు నాయకులు నగేష్, శివన్నారాయణ, కుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.












