నిర్మల్ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ఈ సూచనలు చేశారు.
జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ తో కలిసి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు ఆయన సూచించారు.
మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమంలో విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించిన పలు దరఖాస్తులను ప్రజలు అదనపు కలెక్టర్లకు సమర్పించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం లభించింది.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీఓ రత్న కళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు. అధికారులు ప్రజల వినతులను సానుకూలంగా స్వీకరించి, పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.











