జిల్లా ప్రజలకు వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా స్థితిగతులపై కలెక్టర్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎక్కడా కూడా ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడకుండా చూడాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు. తాగునీటి సరఫరా పైపుల్లో లీకేజీలు, ఇతర మరమ్మత్తులుంటే వెంటనే చేపట్టాలని ఆదేశించారు.
నీటి ఎద్దడి అధికంగా ఉన్న గ్రామాల్లో ప్రత్యేకంగా తాగునీటిని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, డిపిఓ శ్రీనివాస్, జెడ్పి సీఈవో భాగ్యలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.








