నిర్మల్ జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాలు (SHGs) రుణాల వసూళ్లలో 100 శాతం రికవరీ సాధించి రాష్ట్రస్థాయిలో విశేష గుర్తింపు పొందాయి. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDO) అధికారి విజయలక్ష్మికి రాష్ట్రస్థాయి “బెస్ట్ అప్రిషియేషన్ అవార్డు” ప్రదానం చేయబడింది.
హైదరాబాద్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మరియు శాఖ కమిషనర్ చేతుల మీదుగా విజయలక్ష్మి ఈ అవార్డును స్వీకరించారు. మహిళా సంఘాల బలోపేతం, ఆర్థిక క్రమశిక్షణ, రుణాల సమర్థ వసూళ్లు, మరియు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాల కల్పనలో నిర్మల్ జిల్లా ఆదర్శంగా నిలిచిందని అధికారులు ప్రశంసించారు.
ఈ విజయానికి మహిళా సంఘాల సభ్యులు, ఏపీఎంలు, సీసీలు, వీవోఏలు, గ్రామ సమాఖ్యలు, మరియు మండల స్థాయి సిబ్బంది సమిష్టి కృషి కారణమని డీఆర్డీఓ అధికారి విజయలక్ష్మి తెలిపారు. జిల్లాలో మహిళా సంఘాలు ఆర్థికంగా మరింత బలోపేతం కావడానికి నిరంతరం కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు.
అవార్డు అందుకోవడంతో జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవడం గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ పురస్కారం జిల్లాలోని మహిళా సాధికారతకు మరియు ఆర్థిక స్వావలంబనకు నిదర్శనంగా నిలుస్తుందని భావిస్తున్నారు.












