రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను నియమించడంతో పాటు, ఆయా సంస్థలకు తగిన నిధులు కేటాయించాలని గౌడ జనహక్కుల పోరాట సమితి ‘మోకు దెబ్బ’ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిధులు లేకుండా పదవుల నియామకాలు ప్రజలకు ప్రయోజనం చేకూర్చనని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను నియమించింది. అయితే, ఈ కార్పొరేషన్లకు బడ్జెట్లో అత్యల్ప నిధులు కేటాయించడం, కేటాయించిన నిధులను కూడా పూర్తిగా విడుదల చేయకపోవడంపై అమరవేణి నర్సాగౌడ్ విమర్శలు గుప్పించారు. నిధులు లేని నియామకాలు కేవలం లాంఛనప్రాయంగానే మిగిలిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
కొత్తగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్లు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధుల విడుదలకు కృషి చేయాలని నర్సాగౌడ్ సూచించారు. వృత్తిదారుల సంక్షేమం, ఉపాధి కల్పన, చేతివృత్తుల ఆధునీకరణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.
రాష్ట్రంలో వివిధ వృత్తిదారుల కోసం ఇప్పటికే కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్పొరేషన్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. అయితే, ఈ కార్పొరేషన్లు నిధుల కొరతతో నిర్వీర్యమై, సిబ్బందికి కూడా పనిలేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
2026-27 బడ్జెట్లో ప్రతి కార్పొరేషన్‌కు కనీసం రూ.5 వేల కోట్లు కేటాయించి, చేతివృత్తులను అభివృద్ధి చేయాలని అమరవేణి నర్సాగౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.












