ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, బాలలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించే లక్ష్యంతో నిర్మల్ జిల్లాలో నూతనంగా నిర్మించిన భరోసా భవనాన్ని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్ మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కేంద్రం బాధితులకు అండగా నిలుస్తుందని డీజీపీ తెలిపారు.
ఈ సందర్భంగా భరోసా కేంద్ర ఆవరణలో మొక్కలు నాటి, కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం, పోక్సో కేసుల బాధితులకు ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబ విభేదాల కారణంగా విడిపోయి, తిరిగి సయోధ్య కుదిరిన జంటలకు ప్రోత్సాహకంగా బహుమతులను పంపిణీ చేశారు.
డీజీపీ మాట్లాడుతూ, మహిళలు, బాలలపై జరిగే నేరాలపై వేగవంతమైన స్పందనతో పాటు బాధితులకు అన్ని విధాల సహాయం అందించడంలో భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా బాధితులకు న్యాయ సహాయం, మానసిక ధైర్యం, ఇతర సహాయ సేవలు అందుతాయని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్, భైంసా ఏఎస్పీ రాజేష్ మీనా, నిర్మల్ ఏఎస్పీ సాయి కిరణ్, జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, షీ టీమ్స్, భరోసా సిబ్బందితో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భరోసా భవనం ఏర్పాటుతో జిల్లాలో భద్రతా వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని అధికారులు తెలిపారు.












