భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించి, పలువురితో కలిసి రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేశారు.
మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, నిర్మల్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అంబేద్కర్ ఒక గొప్ప మేధావి అని, ఆయన ఆశయాలను అనుసరిస్తూ సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
జయంతి వేడుకల్లో భాగంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తూ, కలెక్టర్ అధికారులతో కలిసి రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఎస్సీ సంక్షేమ శాఖాధికారి దయానంద్, సీపీఓ జీవరత్నం, డి.ఈ.ఓ భోజన్న, వివిధ సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












