మిర్యాలగూడ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజపాలన ప్రగతి ప్రణాళిక నివేదికల సమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ పరిధిలోని సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు పురోగతిని వివరించారు. ఆరోగ్య, గృహనిర్మాణ, విద్యుత్, పింఛన్లు, వ్యవసాయ, విద్యా రంగాలకు సంబంధించిన గణాంకాలను అధికారులు సమర్పించారు.
వైద్య శాఖ తరపున మార్చి నెలలో జరిగిన గర్భిణీ స్త్రీల నమోదు, టీకా కార్యక్రమాలు, ఆసుపత్రులలో కాన్పులు, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు, బీసీజీ, మీజిల్స్ టీకాల పంపిణీ వివరాలను మండల వైద్యాధికారి డాక్టర్ ఎస్కె మోయిద్ తెలియజేశారు. గృహనిర్మాణ శాఖ హౌసింగ్ ఏఈ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, మార్కౌట్, నిర్మాణం వివిధ దశలలో ఉన్న ఇళ్ల సంఖ్యను వివరించారు. విద్యుత్ ఏఈ రాంలాల్, గృహజ్యోతి పథకం కింద 11116 మందికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మంజూరు అయినట్లు తెలిపారు.
మండల ఎంపీడీఓ ఎం.శేషగిరిశర్మ, చేయూత పథకం కింద 8232 మంది లబ్ధిదారులకు వివిధ రకాల పింఛన్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. డిప్యూటీ తహసిల్దార్ సివిల్ సప్లైస్ రవీందర్ రెడ్డి, మహాలక్ష్మి పథకం కింద 11446 మందికి రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ అవుతున్నట్లు తెలిపారు. ఎంఏఓ ఋషియంద్రమణి, రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్న బియ్యం బోనస్ వివరాలను, తహసిల్దార్ పి.శ్రీనివాస్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, కొత్త రేషన్ కార్డుల జారీ గణాంకాలను సమర్పించారు.
మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మయ్య, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, విద్యా సంస్థల వివరాలు, అమ్మ ఆదర్శ పాఠశాల పథకం, ఎస్ఎస్సి ఫలితాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఎంఈఓ ధర్మానాయక్ వివరించారు. శానిటేషన్, ప్లాస్టిక్ నిర్మూలనపై ఎంపీఓ ఎం. రమేష్ మాట్లాడారు. ఈ సమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.








