మిర్యాలగూడ పట్టణ అభివృద్ధి లక్ష్యంగా నూతన మున్సిపల్ పాలకవర్గం పనిచేస్తుందని, అవినీతి, అక్రమాలకు తావులేకుండా నిజాయితీతో అభివృద్ధికి కృషి చేస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్పర్సన్ గుడిపాటి శిరీష నవీన్ లు తెలిపారు.
శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, తాము అధికారంలోకి వచ్చి మూడు నెలలే అయిందని, ఈ సమయంలోనే మున్సిపల్ కార్యాలయాల్లో ఆయా విభాగాలలో అవకతవకలు ఉన్నాయని, ఇటీవల ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారని పేర్కొన్నారు. ఈ అవకతవకలకు ప్రస్తుత పాలకవర్గానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించామని, సుమారు 10 కోట్ల వరకు పన్ను వసూలు చేశామని తెలిపారు. మిగిలిన బకాయిలు ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినవని, వాటిని వసూలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రధానంగా పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.
తమ పాలకవర్గంలో అవినీతి, అక్రమాలకు తావు లేదని, గతంలో కంటే ఇప్పుడు సత్య సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ప్రతి ఆటో అన్ని వీధులలో తిరుగుతూ చర్చ సేకరిస్తుందని చెప్పారు. కళాభారతిలో అనేక ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మున్సిపాలిటీకి సంబంధించిన డీజిల్ కొంతమేరకు ఖర్చు అయిందని తెలిపారు. గత ప్రభుత్వ, మునిసిపల్ పాలక వర్గంలో జరిగిన పనులలో అవినీతి, అవకతవకలు ఏసీబీ దాడుల్లో వెలుగులోకి వచ్చాయని, దీంతో ప్రజలు అపోహలు పడవద్దని సూచించారు.
మున్సిపాలిటీలో జరుగుతున్న వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం తమ బాధ్యత అని, కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న పనులను పూర్తిగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. తమ పరిధిలో లేని అంశాల పట్ల తాము మాట్లాడలేమని, ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మవద్దని, నిజాయితీతో అవినీతికి ఆస్కారమివ్వకుండా మిర్యాలగూడ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని చెప్పారు. డంపింగ్ యార్డును మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారని, అవకతవకలు జరిగే అవకాశం లేదని, భవిష్యత్తులో పట్టణ అభివృద్ధికి అనేక పథకాలు రూపొందించామని వారు తెలిపారు.











