లక్ష్మణచందా మండలంలోని పొట్పల్లి గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఎంపీడీవో రమాకాంత్ మంగళవారం పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, గ్రామ నర్సరీ, రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాల కల్పన వంటి అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.
గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించిన ఎంపీడీవో, నిర్వహణపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాణ్యత, సమయపాలన పాటించాలని ఆదేశించారు. లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
గ్రామ నర్సరీని సందర్శించి, మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గ్రామంలో చేపట్టిన ఇతర అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించి, వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ తనిఖీల్లో పంచాయతీ సెక్రెటరీ ప్రియాంక రెడ్డి, గ్రామ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.












