బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
తెలంగాణలో అత్యంత ఎత్తైన కుంటాల జలపాతం, సుందరమైన పొచ్చేరా జలపాతాలు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జలకళను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో జలపాతాల వద్ద నీటి ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. ఈ అందాలను ఆస్వాదించేందుకు రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన జలపాతంగా పేరుగాంచిన కుంటాల జలపాతం, సుందర ప్రకృతి అందాలకు ప్రతికగా నిలిచిన పొచ్చేరా జలపాతాలు రెండు రోజులుగా కురుస్తున్న విస్తార వర్షాలతో జలకళను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వాగు వంకలు పొంగిపొర్లుతుండటంతో జలపాతాల వద్ద భారీగా నీటి ప్రవాహం కొనసాగుతోంది.
ఎత్తైన కొండలపై నుంచి తెల్లగా పాల నురుగుల వలె దూకుతున్న జలదారలు, చుట్టూ అలుముకున్న పచ్చని అడవులు, ప్రకృతి ఒడిలో విరజిల్లుతున్న సోయగాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. జలపాతాల అందాలను ఆస్వాదించేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
జలపాతాల వద్ద ప్రకృతి అందాలను తమ కెమెరాల్లో బంధించుకుంటూ, సెల్ఫీలు దిగుతూ సందర్శకులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ కుటుంబ సమేతంగా ప్రకృతి ఒడిలో ఆహ్లాదకర క్షణాలను ఆస్వాదిస్తున్నారు.
అయితే, జలపాతాల వద్ద నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్న నేపథ్యంలో పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా సూచనలు పాటిస్తూ ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
వర్షాకాలంలో కుంటాల, పొచ్చేరా జలపాతాలు మళ్ళీ తమ సహజ సౌందర్యాన్ని చాటుకుంటూ పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి.












