మిర్యాలగూడ పట్టణానికి చెందిన 100 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ఆధ్వర్యంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేద ప్రజల సంక్షేమ, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.
గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్, ఆర్డీవో రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు, నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చేరువయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పేదింటి ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకాల ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, ఈ పథకాల ద్వారా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారని ఎమ్మెల్యే వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.












