ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని ఇకపై డివిజన్ స్థాయిలో కూడా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. ఈ మేరకు సోమవారం నుండి నిర్మల్ ఆర్డీఓ కార్యాలయం, భైంసా సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.
ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా చూడాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఇప్పటికే నిర్వహిస్తున్న ప్రజావాణితో పాటు, డివిజన్ స్థాయిల్లోనూ ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మారుమూల ప్రాంతాల ప్రజలు తమ సమస్యలను స్థానికంగానే విన్నవించుకునే అవకాశం లభిస్తుంది.
డివిజన్ స్థాయి అధికారులు ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. భూ భారతి, భూ వివాదాలు, విద్యా, వైద్యం, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర పౌర సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను లిఖితపూర్వకంగా సమర్పించవచ్చు.
అందిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేసి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజలకు మధ్య సమన్వయం మరింత మెరుగుపడుతుందని భావిస్తున్నారు.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా కోరారు. డివిజన్ స్థాయి ప్రజావాణి ద్వారా సమస్యల పరిష్కార ప్రక్రియ వేగవంతం అవుతుందని అధికారులు ఆశిస్తున్నారు.












