బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహనీయులకు నివాళులర్పించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రం ఏర్పడిన అనంతరం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కొనసాగుతోందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుస్తున్నాయని చైర్మన్ పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయని అన్నారు.
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మార్కెట్ యార్డులో రైతులు తీసుకువచ్చిన జొన్నలను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మోహన్ రెడ్డి, డైరెక్టర్లు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.












