నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో ఇటీవల ఆదివాసులపై అటవీ శాఖ అధికారులు జరిపిన దాడిని ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ఖండించింది. బాధితులను పరామర్శించిన నాయకులు, పోడు భూములకు వెంటనే హక్కు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో ఈ నెల 16వ తేదీ తెల్లవారుజామున అటవీ అధికారులు ఆదివాసులను భయభ్రాంతులకు గురిచేశారని, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి, కొందరిని బలవంతంగా తీసుకెళ్లారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటనతో ఆదివాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే తుడుం దెబ్బ నాయకత్వం ఉన్నతాధికారులతో మాట్లాడి ఒత్తిడి తీసుకురావడంతో నిర్బంధించిన వారిని విడుదల చేశారని పేర్కొన్నారు.
తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గోడాం గణేష్ ఆధ్వర్యంలో గ్రామాన్ని సందర్శించిన నాయకుల బృందం, బాధితుల సమస్యలను అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో గోడాం గణేష్ మాట్లాడుతూ, పోడు భూములను నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం వెంటనే ఉమ్మడి హక్కు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసి గ్రామాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అధికారులు రాజ్యాంగం, చట్టాలకు లోబడి పనిచేయాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో ఆదివాసి గూడాలపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు. అటవీ అధికారుల వేధింపులు కొనసాగితే ప్రజా సంఘాలను ఏకం చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి వెట్టి మనోజ్, ఆదివాసి విద్యార్థి సంఘం ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సలాం వరుణ్, నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోడసం గోవర్ధన్, రాష్ట్ర నాయకులు ఆనందరావు, ఆర్క శేషారావు, సామాజిక కార్యకర్తలు, మాజీ ఎంపీపీ రాజేశ్వర్ గౌడు, ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిదం జంగు దేవ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.












