నిర్మల్ జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని, రెండో దశలో ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
రెండో దశ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుడిసెల్లో నివసించే అర్హులైన పేదలందరికీ రెండో దశలో ఇండ్లను అందించాలని సూచించారు.
రెండో దశలో మంజూరైన ఇండ్లు, దరఖాస్తుల పరిశీలన, అనుమతించిన ఇండ్లు, ఎంపీడీవో లాగిన్ల నుండి కలెక్టర్ లాగిన్లకు పంపిన ఇండ్ల వంటి వివరాలను మండలాల వారీగా ఎంపీడీవోలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూడాలని ఆదేశించారు.
పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని, అనుమతుల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ గట్టిగా చెప్పారు. రోజువారీగా సంబంధిత నివేదికలన్నీ తనకు అందజేస్తూ ఉండాలని, ప్రక్రియలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, హౌసింగ్ పిడి శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం ప్రయోజనాలు చేరడమే లక్ష్యంగా పనులు జరగాలని కలెక్టర్ నొక్కి చెప్పారు.












