మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 04
దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా పునః పరిశీలన (సర్) కార్యక్రమం పెద్ద సవాలుగా మారింది. ఓటర్ల జాబితాల నుంచి భారీ సంఖ్యలో పేర్లు తొలగిపోతుండటంతో పాటు, ఈ ప్రక్రియను ఎన్నికల కమిషన్ నిర్లక్షంగా నిర్వహిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరైన ఆధారాలు లేకుండా ప్రజలను ఓటు హక్కుకు దూరం చేయడం రాజ్యాంగ సూత్రాలను దెబ్బతీస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
** ఓటర్ల తొలగింపు.. ‘ఇసి’కే తలవంపు –మనోరంజని తెలుగు టైమ్స్ సంపాదకీయం దేశంలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా పునః పరిశీలన (సర్) కార్యక్రమం, భారత గణతంత్రం ఏర్పడిన తరువాత ఎదురైన పెద్ద సవాలు. ఎందుకంటే ఓటర్ల జాబితాలనుంచి భారీ సంఖ్యలో పేర్లు తొలగిపోతున్నాయి. అంతేకాకుండా, ఈ ప్రక్రియను ఎన్నికల కమిషన్ నిర్లక్షంగా, బాధ్యతారహితంగా నిర్వహిస్తోందన్న తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏవో కొన్ని అనుమానాలతో, సరైన ఆధారాలు లేని సాకులతో ప్రజలను ఓటు హక్కుకు దూరం చేయడం, రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యానికి పునాదులైన మూల సూత్రాలనే దెబ్బతీస్తోంది. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే, తమ ప్రజాస్వామ్య హక్కును తిరిగి పొందడానికి నిరుపేద, నిస్సహాయ ఓటర్లు అంతులేని న్యాయ ప్రక్రియల్లో చిక్కుకుపోతుండగా, ఎన్నికల కమిషన్ మాత్రం దీనిని తన గొప్ప విజయంగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం సాగించడం గమనార్హం. ఎన్నికల కమిషన్ ఓటర్లను ఎన్నుకునే పరిస్థితి ఏర్పడింది. న్యాయ వ్యవస్థ కూడా దీనికి ఇష్టాపూర్వకంగా సహకరించే పాత్రను పోషిస్తున్నట్టు రూఢి అవుతోంది. ఇక ప్రభుత్వం ఈ పరిస్థితిని చూసి ఎంతో సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తోంది. 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితాల సవరణ మూడో దశలో సుమారు 36కోట్ల మంది పేర్లతో ఉన్న ఓటర్ల జాబితానుంచి 6కోట్ల మంది పేర్లు తొలగించబడినట్టు అంచనా. ఈ ప్రక్రియలో దేశరాజధాని ఢిల్లీలో ప్రతి ముగ్గురు ఓటర్లలో ఒకరిని ఓటు వేయడానికి అనర్హులుగా ప్రకటించారు. ఓటర్ల జాబితా సవరణలో ఓటరు ఆ ప్రాంతంలో నిజంగా నివసిస్తున్నారా లేదా, ఒకే వ్యక్తి పేరు ఎక్కువ చోట్ల ఉందా? తదితర అంశాలను పరిశీలిస్తారు. చిరునామా మారిన వారు, లేదా ఆ ప్రాంతంలో నివసించని వారి వివరాలను సరిచేస్తారు. అవసరమైన పత్రాలు, ధ్రువీకరణ అందించని, లేదా అర్హతను నిరూపించలేని వారి పేర్లు తొలగించవచ్చు. ఈ నేపథ్యంలో 6కోట్ల పేర్లు తొలగించబడ్డాయంటే ఆ ఆరు కోట్ల మంది ఓటు హక్కును శాశ్వతంగా కోల్పోయారని అర్థం కాదు. కొందరి పేర్లు తప్పుగా తొలగించి ఉండవచ్చు. కొందరు వేరే ప్రాంతానికి మారి ఉండవచ్చు. మరికొందరు కావలసిన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోయి ఉండవచ్చు. తుది ఓటర్ల జాబితా, అభ్యంతరాలు, అప్పీళ్ల ప్రక్రియ తర్వాత సంఖ్య మారవచ్చు. మహారాష్ట్రలో 2కోట్లకు పైగా ఓటర్ల పేర్లను జాబితాలనుంచి తొలగించారు. కర్ణాటకలో 1.07కోట్లు, తెలంగాణలో 73లక్షలు, ఆంధ్రప్రదేశ్లో 44లక్షలు, జార్ఖండ్లో 43లక్షల పేర్లు మహారాష్ట్రలో 2కోట్లకు పైగా, ఓటర్లను తొలగించారు. కొన్ని నెలల క్రితం పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా నుంచి దాదాపు 90 లక్షల మంది పేర్లు తొలగించారు. ఈ విధంగా ఓటు హక్కును కోల్పోయిన వారందరికీ ఎన్నికలు జరగక ముందే ట్రైబ్యునళ్ల ముందు తమ వాదనను వినిపించే అవకాశం ఎన్నికల సంఘం కల్పించకపోవడం విడ్డూరం. ఎన్నికలు జరిగే సమయానికి కేవలం కొన్ని వేల అప్పీళ్లను మాత్రమే విచారించారు. ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే పశ్చిమ బెంగాల్ లోని ‘సర్’ అప్పీలు ట్రైబ్యునళ్లకు ఓటు హక్కును పునరుద్దరించాలని అప్పీలు చేసిన 82,782 మందిలో 75,443 మందికి తిరిగి ఓటు హక్కును కల్పించడం విశేషం. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుకు అనర్హులుగా ప్రకటించిన వారిలో 91శాతం మంది విషయంలో అన్యాయం జరిగినట్టే కదా! వీరి పేర్లను ఓటర్ల జాబితానుంచి అన్యాయంగా, అప్రజాస్వామికంగా, చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఎన్నికల సంఘం తొలగించిందని బయటపడింది. కానీ వీరికి న్యాయమైన విచారణకు సుప్రీం కోర్టు అవకాశం కల్పించలేదు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించే చట్టబద్ధమైన అధికారం తనకు ఉందని ఎన్నికల సంఘం చెబుతోంది. ఆ అధికారంపై ఎవరూ అభ్యంతరం చెప్పడంలేదు. అయితే ఓటర్ల జాబితాను సవరించడం అంటే ప్రజల ఓటు హక్కును తొలగించడం కాదు. ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రజలకు ఉన్న ఇతర హక్కులు, ప్రభుత్వ సేవలను నిరాకరించే అవకాశం కల్పించాయి. ఉదాహరణకు పాస్పోర్ట్ పునరుద్ధరణ, రేషన్ కార్డు పొందడం, ప్రభుత్వ పథకాల కింద బియ్యం పొందడం వంటి వాటిని కూడా నిరాకరించే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ప్రధాన ఎన్నికల కమిషనర్ స్వయంగా ఓటర్ల జాబితాను పౌరసత్వంతో ముడిపెడుతున్నారు. కానీ పౌరసత్వం అనేది ఎన్నికల కమిషనర్ పరిధి లోని విషయం కాదు. ఓటర్ల జాబితాలో తమ పేరు ఉండటానికి తాము అర్హులమని ఓటర్లే నిరూపించుకోవాలని ఎన్నికల సంఘం చెప్పడం ఓటర్ల హక్కులకు ముప్పుగా పరిణమిస్తోంది. సహజమైన న్యాయం, సాధారణ విజ్ఞత ప్రకారం చూస్తే ఎవరిపేరైనా ఓటర్ల జాబితా నుంచి తొలగించే ముందు ఎన్నికల సంఘం తగిన ఆధారాలను చూపించగలగాలి. ఎందుకంటే ఓటర్ల జాబితాను తయారు చేసేది ఎన్నికల సంఘమే. అందువల్ల ప్రజల ఓటు హక్కును హరించే విధంగా ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియ తాను రూపొందించిన వ్యవస్థనే బలహీనపరుస్తోందని చెప్పవచ్చు. ఓటు హక్కు అనేది పిల్లల ఆట కాదు. దానిని తేలికగా తీసుకోలేం. ఎన్నికల సంఘానికి ఈ విషయం అర్థం కాకపోతే, సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని రాజ్యాంగం ఏం చెబుతోందో స్పష్టంగా గుర్తు చేయాల్సిన అవసరం వస్తుంది. భారత రాజ్యాంగ వ్యవస్థలో రాజకీయ అధికారానికి ప్రజలే మూలం. అర్హులైన పౌరులు ఓటు వేయలేని పరిస్థితి ఏర్పడితే ప్రజాస్వామ్య ప్రాతినిధ్యమే దెబ్బతింటుంది.












