మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
కేంద్ర మంత్రిగా పనిచేసిన ప్రహ్లాద్ వెంకటేశ్ జోషి, బిల్కిస్ బానో కేసులో శిక్ష పడ్డ నేరస్తుల విడుదలను సమర్థించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో అత్యాచారం, హత్యలకు పాల్పడిన 11 మందిని 'చట్టప్రకారం', 'సత్ప్రవర్తనాపరుల'ని జోషి బహిరంగంగా సమర్థించారు. అయితే, సుప్రీం కోర్టు ఆ తర్వాత వారి విడుదలను తప్పుబడుతూ జైలుకు తిరిగి పంపాలని ఆదేశించింది.
మహా ఘనత వహించిన మన కొత్త విద్యా శాఖ మంత్రి ప్రహ్లాద్ వెంకటేశ్ జోషి ఘన చరిత్రలో ఒక మచ్చు తునక: ఒక గర్భిణిపై అత్యాచారం చేసిన, మూడు సంవత్సరాల పసి పాపతో సహా పద్నాలుగు మందిని హత్య చేసిన, ఆ నేరం ఒకటికి రెండు కోర్టులలో రుజువైన, నేరస్తులను సమర్థించిన మహానుభావుడు మన విద్యామంత్రి!
గుజరాత్ మారణకాండ సందర్భంగా 2002 మార్చ్ లో ఐదు నెలల గర్భిణి, ఇరవై ఒక్క సంవత్సరాల బిల్కిస్ బానో అనే యువతి మీద ఆర్ ఎస్ ఎస్ మూకలు అత్యాచారం చేశాయి. ఆమె మూడు సంవత్సరాల కూతురితో సహా కుటుంబ సభ్యులు పద్నాలుగు మందిని నరికి చంపాయి. ఆ కేసు విచారణకు వచ్చి, గుజరాత్ లో అయితే నేరస్తులకు అనుకూల వాతావరణం ఉంటుందని, సరైన విచారణ జరగకపోవచ్చునని, సుప్రీం కోర్టు, కేసును మహారాష్ట్ర కోర్టుకు బదిలీ చేసింది.
ముంబాయి లోని ప్రత్యేక సిబిఐ కోర్టులో విచారణ జరిగి, సంపూర్ణ సాక్ష్యాధారాలతో నేరం రుజువై, సామూహిక అత్యాచారం, హత్య నేరాల నిర్ధారణ జరిగి, పదకొండు మంది నేరస్తులకు 2008 మార్చ్ లో యావజ్జీవ శిక్ష విధించారు. మామూలుగా జరిగినట్టే నేరస్తులు పై కోర్టుకు అప్పీలుకు వెళ్లగా, 2017 మేలో బొంబాయి హైకోర్టు కూడా నేరాలను నిర్ధారించి శిక్షలు ఖరారు చేసింది.
కాని 2022 ఆగస్ట్ 15 భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఆ పదకొండు మంది నేరస్తులనూ విడుదల చేసింది. అప్పటికి కేంద్ర మంత్రిగా ఉండిన ప్రహ్లాద్ జోషి వెంటనే ఆ నేరస్తుల విడుదలను సమర్థించాడు. వారు "చట్టప్రకారం" విడుదలయ్యారని, "సత్ప్రవర్తనాపరుల"ని బహిరంగ పత్రికా సమావేశాలలో వారికి తన మద్దతు ప్రకటించాడు.
2024 జనవరిలో సుప్రీం కోర్టు ఆ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తప్పు అనీ, వారిని విడుదల చేయడానికి వీలు లేదనీ తీర్పు చెప్పింది. వారు వెంటనే జైలుకు తిరిగి వెళ్లాలని ఆదేశించింది. ఆ సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కూడా, తాను అంతకు ముందు నేరస్తులకు ఇచ్చిన కితాబు పొరపాటని అంగీకరించని మహానుభావుడు మన కొత్త విద్యామంత్రి!












